
తెలుగులో ఉన్న స్టార్ హీరోల్లో మణిరత్నం దర్శకత్వంలో నటించిన క్రెడిట్ ఒక్క నాగార్జునకు మాత్రమే ఉంది. త్వరలో అటువంటి అదృష్టం ప్రిన్స్ మహేష్‌బాబుకు కూడా సొంతం కానుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. మణిరత్నం దర్శకత్వంలో మహేష్ ఓ సినిమాలో నటించనున్నట్టు, అందులో మరో హీరోగా విక్రమ్ కూడా ఉన్నట్లు, చరిత్రాత్మక కథాంశంతో ఈ సినిమా రూపొందనున్నట్లు గతంలో కొన్ని వార్తలొచ్చిన విషయం తెలిసిందే.
అయితే... మహేష్ ఈ వార్తల విషయంలో అప్పుడు స్పందించలేదు. కానీ, తాజాగా తన ట్విట్టర్‌లో ఆయన పోస్ట్ చేసిన మెసేజ్ గతంలో వచ్చిన వార్తలకు బలాన్ని చేకూర్చినట్లయింది. ‘‘నా జీవితంలో గొప్పగా భావించే న్యూస్‌ని అభిమానులకు చెప్పబోతున్నాను. ఇటీవలే మణిరత్నం సార్‌ని కలిశాను. ఆయన లెజెండ్రీ డెరైక్టర్. తనతో సినిమా చేయాలనే నా చిరకాల వాంఛ నిజం కాబోతోంది.
త్వరలో మా కాంబినేషన్‌లో ఓ సినిమా రానుంది. నా జీవితంలో మరచిపోలేని సినిమా ఇది. ఎంతో ఆనందానికి లోనవుతూ ఈ వార్తను పోస్ట్ చేస్తున్నాను’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు మహేష్. ఈ వార్త సూపర్‌స్టార్ అభిమానులకే కాదు. అభిరుచి గల తెలుగు ప్రేక్షకులకు కూడా శుభవార్తే. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఉంటుందని సమాచారం.
No comments:
Post a Comment